మీ డీమ్యాట్ అభ్యర్థన ఫారం తిరస్కరించబడితే మీరు ఏమి చేయాలి

1 min read
by Angel One
ఆన్‌లైన్ డీమ్యాట్ ఖాతాలు భారతదేశంలో 1996లో ప్రారంభింపబడ్డాయి. ఇంతకు ముందు అధిక వ్యాపారం  కాగితం ఆధారితంగా జరిగేది. ముదుపరులు షేర్లను భౌతిక రూపంలో కొనుగోలు చేసేవారు. దీని వలన భౌతిక షేర్ సర్టిఫికేట్ పోగొట్టుకోవడం  లేదా పాడైపోవడం, పేరు లేదా సంతకంలో వ్యత్యాసం మరియు ఇతర పేపర్-వర్క్ వంటి అనేక సమస్యలు తలెత్తేవి.  డీమ్యాట్ ఖాతాలు రావడంతో  అటువంటి అనవసరమైన సమస్యలు  తొలగిపోయాయి. అయినప్పటికీ చాలా మంది ముదుపరుల షేర్లు ఇప్పటికీ భౌతిక రూపంలోనే ఉన్నాయి. వీరు డీమ్యాట్ ఖాతా రాక ముందు తమ షేర్లను కొనుగోలు చేసి, వాటిని డీమెటీరియలైజ్ చేయడం మర్చిపోయి ఉండవచ్చు లేదా స్టాక్ మార్కెట్‌లలో చురుకుగా పాల్గొనని ముదుపరులై  ఉండవచ్చు. అటువంటి ముదుపరులు ఈరోజు తమ షేర్లను అమ్మాలనుకుంటే , వారు ముందుగా తమ షేర్లను డీమ్యాట్ లేదా డీమెటీరియలైజ్డ్ రూపంలోకి మార్చుకోవాలి. దీనికి మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ లేదా డిపికి సమర్పించాల్సిన డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్ లేదా డిఆర్ ఎఫ్ ను సమర్పించాలి. అయితే, కొన్నిసార్లు డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్ తిరస్కరించబడవచ్చు. అటువంటి సందర్భంలో ఏమి చేయాలో తెలుసుకోవడానికి చదవండి.
 
డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్ అంటే ఏమిటి, దానిని సమర్పించవలసిన విధానం ఏమిటి?
డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్ లేదా డిఆర్ ఎఫ్ అనేది భౌతిక షేర్లు కలిగి ఉన్నవారు తమ హోల్డింగ్‌ను డీమెటీరియలైజ్డ్ విధానానికి మార్చాలనుకున్నప్పుడు నింపే ఫారమ్. మీరు మీ షేర్లను అమ్మాలనుకుంటే డీమెటీరియలైజేషన్ అవసరం. మీరు డిఆర్ ఎఫ్ ని నింపిన తర్వాత, దానిని హోల్డింగ్స్ యాజమాన్యానికి సంబంధించిన భౌతిక సర్టిఫికేట్‌లతో పాటు మీ డిపికి పంపాలి. డీపి మీరు నింపిన అన్ని వివరాలను ధృవీకరించి డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్‌ను సంబంధిత కంపెనీకి లేదా దాని రిజిస్ట్రార్ మరియు బదిలీ (ఆర్ & టి) ఏజెంట్‌కు పంపుతుంది.  రిజిస్ట్రార్ మరియు బదిలీ ఏజెంట్ అనేది అన్ని షేర్‌ఓనర్‌లను ట్రాక్ చేయడానికి మరియు కంపెనీ షేర్‌హోల్డింగ్‌ల బదిలీని ట్రాక్ చేయడానికి కంపెనీ ప్రత్యేకంగా నియమించిన అధికారి. డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్‌ను జారీ చేసిన సంస్థ యొక్క ఆర్ & టి ఏజెంట్ స్వీకరించిన తర్వాత, వారు మళ్లీ ఫారమ్‌ను ధృవీకరించి, సీడీఎస్ ఎల్ లేదా ఎన్ ఎస్ డి ఎల్ లలో ఒక  సంబంధిత డిపాజిటరీకి పంపుతారు. . కాబట్టి ఈ మొత్తం క్రమంలో, మీ డిఆర్ ఎఫ్ రెండు స్థాయిలలో పరిశీలించబడుతుంది – మొదటిది డిపి మరియు రెండవది రిజిస్ట్రార్. అందువల్ల ఈ రెండు స్థాయిలలో దేనిలోనైనా ఇది తిరస్కరించబడే అవకాశం ఉంది. క్రింద మనం ప్రతి స్థాయిలో తిరస్కరణకు గల కారణాలను మరియు ప్రతి సందర్భంలో మీరు ఎలాంటి పరిష్కార చర్యలు తీసుకోవచ్చో పరిశీలిద్దాము.
 
డీమెటీరియలైజేషన్ అభ్యర్థన ఫారమ్ డిపి ద్వారా ఎప్పుడు తిరస్కరించబడుతుంది?
మీ డీమెటీరియలైజేషన్ అభ్యర్థన యొక్క మొదటి స్థాయి ధృవీకరణ డిపి వద్ద జరుగుతుంది. కింది కారణాల వల్ల ఇది మీ డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్‌ను తిరస్కరించవచ్చు:
 
ప్రతి సర్టిఫికేట్కు ప్రత్యేక డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్ సంఖ్య లేదు
మీ వద్ద ఉన్న ప్రతి ఫిజికల్ సర్టిఫికేట్ కు , మీరు ఒక కొత్త డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్ నంబర్‌ను ఉపయోగించాలి . ఈ కారణంగా మీ డిపి మీ ఫారమ్‌ను తిరస్కరిస్తే, మీరు మీ ప్రతి హోల్డింగ్‌కు తాజా ఫారమ్‌ను నింపవచ్చు.
 
సర్టిఫికేట్ మరియు డీమ్యాట్ ఖాతాలో పేరు సరిపోలలేదు
మీ హోల్డింగ్ సర్టిఫికేట్‌లోని పేరు తప్పనిసరిగా డిపితో ఉన్న మీ డీమ్యాట్ ఖాతాలోని పేరు తో సరిపోలాలి.  లేకపోతే దీనిని రెండు విధాలుగా సరిచేయవచ్చు . మీరు పేరు సమస్యలను సరిదిద్దడానికి చట్టపరమైన అఫిడవిట్‌ను సమర్పించవచ్చు లేదా మీ హోల్డింగ్ సర్టిఫికేట్‌లోని పేరుకు సరిపోలే కొత్త డీమ్యాట్ ఖాతాను తెరవవచ్చు.
 
షేర్ల సంఖ్య సరిపోలలేదు
మీ డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్‌లో పేర్కొన్న షేర్ల సంఖ్య, మీ హోల్డింగ్ సర్టిఫికేట్‌లో పేర్కొన్న సంఖ్య ఒకటే అయి   ఉండాలి. లేకపోతే, డిపి మీ ఫారమ్‌ను తిరస్కరిస్తుంది. దీన్ని సరిచేయడానికి, మీరు సరైన వివరాలతో మళ్లీ డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్‌ను నింపవచ్చు. .
 
మీ డిపి మీ ఫారమ్‌ను ధృవీకరించిన తర్వాత, అది మీకు డీమ్యాట్ అభ్యర్థన నంబర్ లేదా డిఆర్ ఎన్ జారీ చేస్తుంది. ఈ డిఆర్ ఎన్ సంక్య ఈ విషయంలో జరిగే అన్ని తదుపరి కమ్యూనికేషన్ కోసం అవసరం కనుక జాగ్రత్తగా ఉంచుకోవాలి.
 
 
రిజిస్ట్రార్ డిమ్యాట్ అభ్యర్థన ఫారమ్ను ఎప్పుడు తిరస్కరిస్తారు
ఆఖరుగా మా డిపి మీ డీఆర్ ఎఫ్ ధృవీకరించిన తర్వాత, ఫారమ్‌ను మీరు షేర్లు కలిగి ఉన్న కంపెనీ రిజిస్ట్రార్ మరియు బదిలీ ఏజెంట్‌కు పంపుతారు. రిజిస్ట్రార్ వారి వైపు నుండి వివరాలను ధృవీకరిస్తారు. రిజిస్ట్రార్ మీ ఫారమ్‌ను క్రింది సందర్భాలలో తిరస్కరించవచ్చు:
 
షేర్ల సంఖ్య సరిపోలడం లేదు
ఒకవేళ డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్‌లో పేర్కొన్న షేర్ల సంఖ్య రిజిస్ట్రార్ రికార్డులలో పేర్కొన్న సంఖ్య కంటే ఎక్కువగా ఉంటే, మీ డీఆర్ ఎఫ్ తిరస్కరించబడుతుంది. అలా జరిగితే మీరు మళ్లీ డీఆర్ ఎఫ్ నింపి రిజిస్ట్రార్‌కు పంపాలి.
 
నకిలీ లేదా దొంగ సర్టిఫికెట్లు
భౌతిక సర్టిఫికేట్‌లను నకిలీ చేయడం లేదా మార్చడం సులభం కనుక ఇది సాధారణంగా ఎదురయ్యే సమస్య. నకిలీ లేదా దొంగ షేర్ల కారణంగా రిజిస్ట్రార్ మీ ఫారమ్‌ను తిరస్కరిస్తే, మీరు ఎవరివద్ద షేర్లను కొన్నారో వారిని  సంప్రదించి, వారితో షేర్ల ప్రామాణికత సమస్యను పరిష్కరించుకోవాలి.
 
సంతకం సరిపోలలేదు
భౌతిక సర్టిఫికేట్‌లతో ఇది మరొక సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఒకవేళ డీమెటీరియలైజేషన్ అభ్యర్థన ఫారమ్‌లోని సంతకం రిజిస్ట్రార్ రికార్డులలో ఉన్న సంతకంతో సరిపోలకపోతే, మీ డీఆర్ ఎఫ్ తిరస్కరించబడ వచ్చు.  సంతకాలు అనేక  కారణాల వల్ల మార్పు చెందవచ్చు . సర్వ సాధారణమైనది వయస్సు-సంబంధిత కారణం. వయసు పెరిగే కొద్దీ సంతకాలు మారడం సర్వసాధారణం. సంతకాలలో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లైతే, మీరు మీ డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్ను ప్రామాణీకరించడానికి మేజిస్ట్రేట్ సమక్షంలో మీ సంతకాన్ని ధృవీకరించి రిజిస్ట్రార్‌కు పంపవచ్చు.
 
ఐ ఎస్ ఐ ఎన్ సరిపోలలేదు
ఐ ఎస్ ఐ ఎన్ లేదా అంతర్జాతీయ సెక్యూరిటీల గుర్తింపు సంఖ్య అనేది ప్రతి సెక్యూరిటీకి ప్రత్యేకంగా ఉండే 12-అంకెల కోడ్, కొన్నిసార్లు కంపెనీలు పూర్తిగా చెల్లించిన లేదా పాక్షికంగా చెల్లించిన షేర్ల వంటి వివిధ రకాల స్టాక్‌ల కోసం అనేక ఐ ఎస్ ఐ ఎన్ లను జారీ చేస్తాయి. అటువంటప్పుడు డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్‌లో స్టాక్ యజమాని తప్పుగా ఐ ఎస్ ఐ ఎన్ ని నింపడం జరగ వచ్చు. ఇదే జరిగితే, సరైన ఐ ఎస్ ఐ ఎన్ తో ఫారమ్‌ను మళ్లీ నింపండి.
 
కంపెనీ షేర్లపై జారీ చేసిన స్టాప్ ఆర్డర్
కొన్ని సందర్భాలలో కంపెనీ షేర్ల అమ్మకంపై సెబీ లేదా న్యాయస్థానం స్టాప్ ఆర్డర్ జారీ చేయవచ్చు. అటువంటి సందర్భాలలో  ఆ  సమస్యలు పరిష్కరించబడే వరకు కంపెనీ షేర్లను మీరు అమ్మలేరు
 
ముగింపు
మీ భౌతిక షేర్లను అమ్మడానికి ముందు వాటిని డీమెటీరియలైజ్ చేయాలి. ఇది చాలా సులువైన విధానం.  దీనికొరకు డీమ్యాట్ అభ్యర్థన ఫారమ్‌ను నిపి దానిని మీ డిపి కి  పంపాలి.  నిర్ణీత ధృవీకరణ తర్వాత అది జారీ చేసేవారికి పంపబడుతుంది. ఈ ప్రక్రియలో తలెత్తే అత్యంత సాధారణ సమస్యలు ఫారమ్ లేదా పేరు లేదా సంతకం సరిపోలక పోవడం లేదా  నింపడంలో  పొరపాట్లు వంటివి.  వీటిని  సరిదిద్దిన  తర్వాత, మీరు మీ ఫారమ్‌ను మళ్లీ పంపవచ్చు.